సారస్వతం

సారస్వతం

మ్రొక్కెద శారద పాద పద్మములన్
ఎక్కెద వినయ జ్ఞాన ముక్తి పీఠములన్
చక్కగ దీవింపవే ఎనయ కవితా సృష్టిని
సొక్కగ నీ కరుణా దృష్టిని కవితాబ్జముఖి 1

విద్యయు వినయంబును వినుతిని
అధ్యయము సేయు నిరతిని
తధ్యమగు బుద్ధిని అరమరకలులేక
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 2

నిజమును నిత్యము పలుకగ
విజయంబులు తోడు రాగ కలతలు లేక
సజ్జనుల సాంగత్యము నిత్యము కలుగునట్లు
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 3

అక్కరకు రాని చదువుల రక్తిని
తర్కముతో అవినయ సక్తిని
మర్కటమగు మనసుని ముక్తిని చేర్చగ శక్తిని
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 4

సాధించెడి శాంతిని సౌక్యము
బోధించెడి విమలమతుల సక్యము
తధిగతి తప్పని మనసును ముఖ్యముగ
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 5

మంచిని మనసున కొలిచెడి మర్మము
అంచితముగ మలినములులేని కర్మము
సంచిత సారస్వత పాదంబుల సర్గము
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 6

పరహితము పరమార్థముగా కలిమిని
నిరతము ధర్మమును నిలుపు బలిమిని
కరతము సద్బుద్ధియు అమలినమును
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 7

వీక్షించుదు జ్ఞానార్థుల కర్మలనెల్ల
కాంక్షించుదు సత్యమార్గ మర్మములెల్ల
సాక్షింపవే నిగమార్గము చేరెడి వల్లము
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 8

పదిమందికి పనికివచ్చు చదువుల సంపద
మదినొచ్చని పలుకుల మనసున నింపగ
కదిలింపగలేని కారుణ్యము కరుణయు
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 9

కుందని స్తైర్యము మెండుగ కలుగగ
అందిన ఆశలు నిండుగా మెలుగగ
చెందిన చదువులెల్ల అండగా నిలుచు కాలము
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 10

కోరను కనకంబులను కీర్తిని
చేరను చెడగతుల పంక్తిని
మేరుగ వినయంబుల విద్యారక్తిని
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 11

వినయముతో కూడు బుద్దిని
అనునయము తోడ సిద్ధిని
కనుమరుగు కాని కారుణ్య లభ్ధిని
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 12

తల్లిని తండ్రిని గురువును ఎల్లప్పుడు
మల్లి వంటి మనసుతో కొలుతుము నేల్లముగా
చెల్లి మా బుద్ధుల త్రోడి మంచిని కడు చల్లగా
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 13

భజింతుము జ్ఞానార్త కర్మ సూత్రములను
త్యజింతుము అవేద నిస్వర గాత్రములను
సృజింపుము ప్రచోదయ బుద్ధిని సత్రము
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 14

ఎంచి చూడగ వానికి అంతయు కుబుద్ధి
మంచి పలికిన వినుము బుద్ధి గాను
పంచి ఇవ్వగ మేలు పదియింతల శుద్ధి
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 15

బుద్ధి కలుగు మాట ఎల్లప్పుడును మేము
శుద్ధి తోడ మఱవక వల్లె వేతుము
లబ్ధి పొందగ మేము మేలైన మనసును
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 16

పుస్తకంబుల పెక్కు చదివితి
విస్తరించగ బుద్ధి మిక్కుటముగా
మస్తకంబున సుమతిని శాంతిని
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 17

దీపంబులు సహస్రముగ దేవునికిచ్చి
పాపంబులు పదివేలు చేయగ నేల
తాపంబుల మ్రాన్పగ పటుత్వ సంపద
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 18

పూట గడవగలేము పాపాలు చేయంగ
మాటలాడగాలేము మంచి గాను
బాట పట్టెడి బుద్ధి లోపాలు లేకుండ
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 19

నాది నాదియనుచు అన్నింటను లభ్ది
ఆదినుంచియు కలదు లోభ బుద్ధి
మదిలోన కలుగగా దానంబు పరులార్తి
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ  20

ఎంచి చూడ మాకు కలవు పాపంబుల్ పదివేలు
పంచి ఇవ్వ మాకు లేవు పరమార్థంబుల్
మంచి బుద్ధి దయతో కూడిన సిద్ధిని
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 21

ఏది చూసిన మాదియను మనస్సు
నాది కాదనిన విడివడని తమస్సు
ఆది అంతములు లేని ఆత్మ శుద్ధిని
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 22

కోరి పలుకగలేము మంచి మాట
చేరి కలువగలేము ఒక్క బాట
నూరి చెప్పెడి బుద్ధి మేలైన గురువును
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 23

చెడ్డ పనులు మేము చేయంగ నేరము
అడ్డ దారుల త్రోవ అంటబోము
దొడ్డ మనసును మరియు మేలైన కీర్తిని
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 24

పెంచి చూడ పదివేలగును తమస్సు
ఎంచి చూడ ఎదుగుచునుండు రజస్సు
అంచితముగ నీ పాదాబ్జ చింతనా సత్వము
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 25

దానంబు చేయ్యంగ ధర్మంబు తెలియదు
మానంబు లోపించె మంచితనము
దీనంబు మా బుద్ధి దివికి చేరెడు శక్తి
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 26

కాలంబుపై మాకు కరుణ లేదు
వాలంబువలె మాది వలస బుద్ధి
మూలంబు తెలుపగా విషయ జ్ఞానార్తి
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 27

అహము తెగదు అంధకారము పోదు
ఇహములో లోపించె మంచితనము
గహనంబుగా బుద్ధి పరము చేరెడు యుక్తి
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 28

ఆత్మ బోధ కన్న ఆనందమొకటిలేదు
తత్వ చింతన కన్న స్వర్గమేలేదు
సత్వ సాధన కోరు మార్గదర్శనము
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 29

కంచి కెళ్ళు కథలు కలియుగంబుల చదువు
మంచి చెప్పలేవు మార్గమున్ తెలుపవు
మించి మాకు చేయు మహనీయ దర్శనము
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 30

వంటిమీద కలదు వీడని మమకారము
అంటిపెట్టుకునుండు అహంకారము
కంటినిండారగా కమ్మని కరుణయు
మాకొసగుము తల్లీ విద్యల వల్లీ 31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »