తెలుగు పలుకు

తెలుగు పలుకు

అమ్మ పలుకు కన్న ఆచారమింకేది
తండ్రి మాట కన్న తత్వమేది
ఆచార్యుడిని మించిన ఆత్మజ్ఞానమేది
నిజము చెప్పెద వినుము నిగ్గుగాను

నవమి తెచ్చును మీకు నవధాన్య సంపత్తి, తరిగిపోని శాంతి తామసగుణ కీర్తి
కోరివచ్చును మీకు భక్తి జ్ఞాన ప్రపత్తి, సత్సంగముల శక్తి శృతుల రక్తి
కరుణపై మీకు కలుగు కమనీయ స్పూర్తి, భూతదయపై ఆర్తి మెండు భక్తి
రామచంద్రుని పాదాలపై సక్తి, మీకెల్లరకును కలుగు అవధిలేని ముక్తి

భోగభాగ్యములతో తులతూగులెల్లరున్
రాగ ద్వేషంబులను వీడి భక్తి గూడి
సాగరాగదా మనకు సిరిగూడి సంక్రాంతి
పగలు లేని చోట వెలుగు కాంతి

రక్షయనుచు సహోదరి ప్రేమ
అక్ష సౌఖ్యములనిచ్చు మీకు
దక్షతతో కాచుమీ అక్కచెల్లెళ్ళను
సుక్షత్రితయతన్ సహోదరా!

చేరి కొలుతుమమ్మ చేతులారంగ మేము
మీరి మనసు పండ నిండు మిసిమి
దారి చూపుమమ్మ దీనులకు నేడు
వారిజాక్ష మాకపుడే విజయదశమి !

శాకాంబరీ దేవి కరుణా కాటాక్షంబు
పాక శాస్త్రంబులో మేలయిన మణిపూస
ఏక నారాధ్యమ్ము గోంగూర పచ్చడి
నాకి చూడు నరుఁడ నెమ్మగాను !

దోర దొరఁగ మెండు దోసకాయలు తెచ్చి
మీర ముక్కలుజేసి నుప్పు జేర్చి
కారమంతయుఁ నావపిండితో మగ్గేసిన
ఊరకుండునా జిహ్వ నుర్వినెల్ల?

వరుడు కోరాడమ్మ వధువంటి వలపు
వధువు గుండెల్లోన వరుడంత తలపు
మించి బొమ్మలకొలువు మిరుమిట్లు గొలుపు
మంచి గంధాల చిలుకు మీకిదియే మా పిలుపు !

మకరమై సూర్యున్డు మంచి తెచ్చును మీకు
సకలసంపదలొసఁగు సంక్రాతి నేడు
అకళంకమై నెపుడు అవని వర్ధిలు గాక
ఏకమై బంధువులు భోగి రాజిలు వేళ!

పౌష్యమాసపు పులకరింతలు
పుడమితల్లికి చేరినంతనే
పంటకోతలు చేతికందగ
(గాలి )పటములెగసెను గగనమంత

భోగిమంటల భవ్యదీప్తుల
భాగ్యరాసుల భరమునెంచి
భువిని నింపెను సంబరములు
భరతమైనవి బ్రతుకు కలలు

గంగిరెద్దుల మెడను గంటలు
నింగికెగసిన భోగి మంటలు
రంగవల్లులు, దాసు పాటలు
పండగిచ్చెను తీపి వంటలు

భానుఁడేగెను మకరమునకు
ఏనుఁగాయెను రైతు బ్రతుకు (ఏనుగు ఐశ్వర్య చిహ్నం )
కాకి కూడా తానమాడే
కనుమ పండగ వచ్చెరా

సంకురాతిరి సంబరమునకై
ఇంటికొచ్చిన అల్లుడిదిగో
అందరొకటిగ అంగరంగపు
పండగిచ్చిన పబ్బమిదిగో

పౌష్యమాసానురాగంబులన్ పరివేష్టించి మధుపాకంబుల నావరించి
కాశ్యాత్మజ తేజవిరోరాజిత సంచిత మకరంబుల భోగింపగానెంచి
సస్యస్యామల చీనాంబరమ్ముల దాల్చి హరికథామృతమ్ము చిలకరింప
లాస్యంబులనేగనదిగో మత్కవితాకావ్యకన్యకామణిన్, సంక్రాంతిన్!

అక్షజ్ఞానప్రాప్త వ్యాహాళిక్కిన్ నన్నేల కరుణింపవు ముమ్మాటికి
శిక్షాదక్ష ధురీణ, నీపదపంకేరుహమ్ములె శరణు గ్రహింపగ
లక్షార్థమునిమ్ము నీ నామంబెన్నేటికి వీడను సత్వార్ధ సంకల్పినై
మోక్షంబే సత్యపథంబు విచారింప, దాశరథీ కరుణాపయోనిధీ!

భవానీ భవహరి భూతదయాభిశోభితా భూరిదాయినీ
కాత్యాయనీ కల్మషహారిణీ కర్మసంధాయినీ కారకీ |
శాంకరీ శాశ్వతసత్యశరీరీ శర్వరీ శత్రుసంహారిణీ
అంబే ఆత్మసంధాయినీ అమృతవర్షిణీ అకృత్యమర్ధనీ ||

కరుణన్ జూపి కావవే కరివరద సోదరీ
నీ కృపావీక్షణంబులకోరు భృత్యుడ, శరణుకోరెదనమ్మ |
వాత్సల్యామృతమ్మువీవు భక్తజనాళికిన్
వాంఛితార్థ ఫలమ్ములీయవే వేడుకలమీరన్ ||

One thought on “తెలుగు పలుకు

  1. చాలా బాగున్నాయి పద్యాలు. ధారాశుద్ధి,భావము ఒకదానిని మించి మరొకటిగా కుదిరాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »